'పరమవీరచక్ర'కు శ్రీకారం

 షో

తన నుండి ఏదీ ఆశించకుండా అభిమానులు చూపిస్తున్న అభిమానమే తనకు శ్రీరామరక్ష అని, అవార్డులు, రివార్డులకంటే తనకు అభిమానులే ముఖ్యమని నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. గురువారం ఆయన 50వ పుట్టినరోజు. అదే రోజు దాసరి దర్శకత్వంలో తేజ సినిమా పతాకంపై సి.కళ్యాణ నిర్మిస్తున్న 'పరమవీరచక్ర' చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్‌లోని కోట్ల విజయభాస్కరరెడ్డి స్టేడియంలో అట్టహాసంగా జరిగింది. బాలకృష్ణపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు క్లాప్‌ ఇచ్చారు. శ్రీమతి దాసరి పద్మ కెమెరా స్విచాన్‌ చేశారు. వేదికపై బాలకృష్ణ నడుచుకుంటూ వస్తూ డైలాగ్‌ చెప్పడాన్ని ముహూర్తపు సన్నివేశంగా చిత్రీకరించారు. ఈ వేడుకలో నందమూరి కుటుంబసభ్యులు హరికృష్ణ, రామకృష్ణ, జూ.ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌, తారకరత్న, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఇంకా మురళీమోహన్‌, కె.ఎల్‌.నారాయణ, ఎ.కోదండరామిరెడ్డి, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. అభిమానులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలకృష్ణ తన ప్రసంగంలో 'ఇంతమంది అభిమానం పొందడం పూర్వజన్మసుకృతంగా భావిస్తున్నాను. మీకు నాకు మధ్య రుణానుబంధం ఉంది. ఇక దాసరిగారితో సినిమా చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను. అది ఇప్పటికి కుదిరింది. నాన్నగారితో 'బొబ్బిలిపులి, మనుషులంతా ఒక్కటే, సర్దార్‌ పాపారాయు' వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన దాసరి మహా మనిషి' అంటూ ప్రశంసించారు.
అంతకుముందు చంద్రబాబు మాట్లాడుతూ 'ఈ సందడి చూస్తుంటే సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామాని అనిపిస్తోంది. కచ్చితంగా ఈ చిత్రం సూపర్‌హిట్‌ అవుతుంది. 'సమరసింహారెడ్డి, నరసింహానాయుడు, సింహా' పాత్రలు చేయడం బాలకృష్ణకు మాత్రమే సాధ్యం. దాసరి, బాలకృష్ణ కాంబినేషన్‌లో ఇది కనివినిఎరుగని విజయం సాధించే చిత్రం అవుతుంది. రాబోయే రోజుల్లో బాలకృష్ణ సినిమాలన్నీ సూపర్‌హిట్‌ అవుతాయి. ఆయన రోజురోజుకు యువకుడిలా అవుతున్నారు. బాలకృష్ణ సినిమాల్లో, రాజకీయాల్లో బ్రహ్మాండంగా రాణించాలి' అని ప్రేక్షకుల హర్షాద్వానాల మధ్య అన్నారు.
'సినిమా గురించి ఇప్పుడేమి చెప్పను. విజయలయ్యాక సినిమానే చెబుతుంది. బాలకృష్ణ కెరిర్‌లో, చరిత్రలో 'పరమవీరచక్ర' నిలిచిపోయే విధంగా కృషి చేస్తాను' అని దాసరి నారాయణరావు చెప్పారు.
 షో
Category: 0 comments

No comments:

Pages