సింగపూర్‌ ఓపెన్‌లో సక్సెస్‌ సైనా

క్రీడాప్రతినిధి
సింగపూర్‌: భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ సింగపూర్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టైటిల్‌ను గెలుచుకొంది. ఆదివారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో సైనా 21-18, 21-15తో జు ఇంగ్‌ తాయి(చైనీస్‌తైపి)ని ఓడించి విజేతగా నిలిచింది. టాప్‌ సీడ్‌ సైనా ప్రారంభం నుంచే అద్భుతంగా ఆడింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మ్యాచ్‌పై పట్టు సాధించింది. క్వాలిఫయర్‌ తాయి కూడా మెరుగైన ఆటతో ఆకట్టుకుంది. సైనాకు గట్టి పోటీ ఇచ్చింది. ఇద్దరు హోరాహోరీగా పోరాడడంతో పోరు ఉత్కంఠ భరితంగా సాగింది. చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్న సైనా 21-18తో తొలి గేమ్‌ను దక్కించుకొంది. రెండో గేమ్‌లోనూ ఇద్దరు నువ్వానేనా అన్నట్లు తలపడ్డారు. ఈసారి కూడా ఆధిక్యం తరచు చేతులు మారింది. తాయి అనుభవరాహిత్యాన్ని సద్వినియోగం చేసుకున్న సైనా మ్యాచ్‌పై పట్టు బిగించింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడి 21-15తో మ్యాచ్‌ను కైవసం చేసుకొంది. సైనా కెరీర్‌లో ఇది రెండో సూపర్‌ సిరీస్‌ టైటిల్‌ కావడం విశేషం. అంతకుముందు 2009లో సైనా ఇండోనేసియా ఓపెన్‌ను తన ఖాతాలో జమా చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే భారత్‌లో జరిగిన చెన్నై ఓపెన్‌లో కూడా సైనా విజేతగా నిలిచింది. కొంతకాలంగా వరుస గాయాలతో సతమతమయిన ప్రపంచ ఆరో ర్యాంక్‌ క్రీడాకారిణి వరుస విజయాలు ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. భారత్‌లో జరిగే కామన్వెల్త్‌ క్రీడల్లో మరింత మెరుగ్గా ఆడేందుకు ఈ విజయాలు దోహదం చేస్తాయి. ఆడిన రెండు టోర్నీల్లో టైటిల్‌ గెలుచుకోవడం ద్వారా సైనా మరోసారి సత్తా చాటింది. ఫైనల్‌ మ్యాచ్‌ ప్రారంభానికే ముందే తండ్రికి టైటిల్‌ గెలుస్తానని హామిచ్చిన సైనా దాన్ని నిలబెట్టుకొంది. ఫదర్స్‌డే నాడు ఇంతకంటే మంచి బహుమతి ఏముంటుందని సైనా తండ్రి హర్విర్‌ సింగ్‌ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. తనకు ఇది నిజంగానే అరుదైన బహుమతని అన్నారు. సైనా టైటిల్‌ గెలుస్తుందనే నమ్మకం తనకు ప్రారంభం నుంచే ఉందన్నారు. ఇచ్చిన మాటా నిలబెట్టుకోవడం సైనాకు వెన్నతో పెట్టిన విద్య అని, ఈ విషయాన్ని మరోసారి తన ఆట ద్వారా నిరూపించిందని హర్విర్‌ సింగ్‌ అన్నారు.
Category: 0 comments

No comments:

Pages