తరతరాల తెలుగు జాతికి ఎన్‌టిఆర్‌ ఆదర్శం : చంద్రబాబు

తెలుగుజాతికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చి, వారి ఆత్మగౌరవాన్ని కాపాడిన ఎన్‌టి రామారావు జీవితం తరతరాల తెలుగు జాతికి ఆదర్శంగా నిలిచిపోతుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఎన్‌టిఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ నారా చంద్రబాబునాయుడు అన్నారు. శనివారం ఉదయం ఎన్‌టిఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో ఎన్‌టిఆర్‌ గ్రేట్‌ ఇంటర్వ్యూ అవార్డు గ్రహీతల సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్రబాబునాయుడు హాజరై అవార్డు గ్రహీతలైన జర్నలిస్టులను సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నటనలో, రాజకీయరంగాల్లో చరిత్ర సృష్టించిన ఎన్‌టి రామారావు వ్యక్తిత్వం, ఔన్నత్వం గురించి విభిన్న కోణాల్లో అధ్యయనం జరగాల్సి వుందని అభిప్రాయపడ్డారు. పౌరాణిక, చారిత్రక సినిమాలు ఏవైనా ఆయనతో పోటీపడి చేసేవారు నేడు లేరన్నారు. రాజకీయాల్లో కూడా అతి తక్కువ కాలంలో పెనుమార్పులు తీసుకువచ్చారని, అలాగే సామాజానికి ఎవరు మంచి పనిచేస్తే వారు ఎప్పటికీ గుర్తుండిపోతారనే విషయం ఎన్‌టి రామారావు విషయంలో నిరూపితమైందన్నారు. అలాంటి మహనీయుడి జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు చేపట్టడానికి ఎన్‌టిఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ ద్వారా ఈరోజున ఎంతో మంది నిరుపేదలకు విద్య, వైద్య, బ్లడ్‌బ్యాంకు, ఉపాధి, తాగునీరు, సహాయ పునరావాస కార్యక్రమాల్లో సేవలందిస్తున్నామన్నారు. ఎన్‌టిఆర్‌ జీవితంలోని అనేక పార్శ్వాలను, అభిప్రాయాలను, సిద్దాంతాలను, నమ్మకాలను, ఆశయాలను, విలువలన్నింటిని భవిష్యత్తు తరాలకు అందించే ఉద్దేశంతో వివిధ రూపాల్లో వున్నవాటిని ఎన్‌టిఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ సేకరణకు పూనుకున్నదని సిఇఓ పి.రఘురామారావు తెలిపారు. ఇందులో భాగంగానే జర్నలిస్టులు ఎన్‌టిఆర్‌తో జరిపిన ఇంటర్వ్యులను ఆహ్వానించగా వచ్చిన వాటిలో మూడింటిని జ్యూరీ సభ్యులు పొత్తూరి వెంకటేశ్వరరావు, డాక్టర్‌ వరదాచారీలు ఎంపిక చేశారన్నారు. యు.వినాయకరావు, పి. శరత్‌కుమార్‌, భగీరథలు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను గెల్చుకున్నారని వెల్లడించారు. అనంతరం జ్యూరీ సభ్యులు పొత్తూరి వెంకటేశ్వరరావు, డాక్టర్‌ వరదాచారిలు ఇంటర్వ్యూల ఎంపికలో పరిశీలించిన విషయాలను, ఎన్‌టి రామారావుతో వారికున్న అనుబంధాన్ని వెల్లడించారు.
అనంతరం బహుమతి గ్రహీతలకు సన్మాన కార్యక్రమం జరిగిందని, ప్రథమ బహుమతికి ఎంపికైన జర్నలిస్టు యు.వినాయకరావును మేనేజింగ్‌ ట్రస్టీ చంద్రబాబునాయుడు శాలువా కప్పి మెమెంటోతోపాటు 25 వేల రూపాయల చెక్కును అందించారు.
పి.శరత్‌కుమార్‌కు ద్వితీయ బహుమతి కింది 15 వేల రూపాయల చెక్కును, తృతీయ బహుమతి కింద భగీరథకు 10 వేల రూపాయల చెక్కును అందించారు. చంద్రబాబునాయుడుతోపాటు సన్మానం చేసిన వారిలో పార్లమెంట్‌ సభ్యులు ఎంవి మైసూరారెడ్డి, సీనియర్‌ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు, డాక్టర్‌ వరదాచారిలు ఉన్నారు. వీరితోపాటు ఇంటర్వ్యూలు పంపించిన జర్నలిస్టులు టి.ఉడయవర్లు, భోగాది వెంకటరాయుడులకు కూడా సన్మానం చేశారు. అనంతరం బహుమతి గ్రహీతలు భగీరథ, పి.శరత్‌కుమార్‌, యు. వినాయకరావులు ఎన్‌టిరామారావుతో వారు చేసిన ఇంటర్వ్యూ విశేషాలను వెల్లడించారు. ఈ సన్మాన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్‌ సభ్యులు ఎంవి మైసూరారెడ్డిలు, సిఇఓ పి.రఘురామారావు, ట్రస్ట్‌ అడ్వయిజర్‌ డాక్టర్‌ సిఎల్‌ వెంకట్రావు పాల్గొన్నారు.
Category: 0 comments

No comments:

Pages